అధికారుల నిర్లక్ష్యం ఆదివాసీల పాలిట శాపం
మాకు రోడ్లు వేయండి మహా ప్రభో
అల్లూరి జిల్లా, సిటిజన్ టైమ్స్, ఏప్రియల్ 04 : ప్రభుత్వాలు మారుతున్నాయి, నిధులు మంజూరవుతున్నాయి, కానీ గిరిజన గ్రామాల తలరాతలు మాత్రం మారడం లేదు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కిట్టు మూల పంచాయతీ పరిధిలోని కప్పసుపాడు గ్రామస్తుల పరిస్థితి ఇందుకు నిదర్శనం. గత 2025 ఆగస్టు నెలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీముడు చెట్టు గ్రామం నుండి కప్పసుపాడు వరకు తారు రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించినప్పటికీ, నేటికీ ఆ పని పూర్తి కాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణానికి సంబంధించి కేవలం మట్టి పనులు మాత్రమే చేసి, తారు రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారు.

వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో రోడ్డు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతుంటే, కాంట్రాక్టర్ మాత్రం తన మాటల గారడీతో కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో చేస్తాం అంటూ మాటలు చెప్పడమే తప్ప, క్షేత్రస్థాయిలో పని ప్రారంభించకపోవడంతో గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు.మంజూరైన నిధులు ఏమయ్యాయి? కాంట్రాక్టర్ పనులు ఆపేసినా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వర్షాకాలం వస్తే ఆ మట్టి రోడ్డు బురదమయమై, రాకపోకలు నిలిచిపోతాయని తెలిసినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? గర్భిణీలు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మొండికేస్తున్న కాంట్రాక్టర్‌ను కఠినంగా మందలించాలని కప్పసుపాడు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే భీముడు చెట్టు నుండి కప్పసుపాడు వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో అధికారుల కార్యాలయాల ముందు భారీ ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
